నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నా సామిరంగ. కథానాయిక ఆషిక రంగనాథ్. విజయ్ బిన్ని దర్శకత్వం. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ నా సామిరంగ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్‌నిస్తుందని అన్నారు. నాగార్జున వంటి అగ్ర హీరోతో తెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపిస్తా. తను స్వతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయి. సాధారణంగా గ్రామీణ నేపథ్య సినిమాల్లోని కథానాయికలు సున్నిత వ్యక్తిత్వంతో కనిపిస్తారు. కానీ వరాలు అలాంటి అమ్మాయి కాదు. తను ఓ ధిక్కార స్వభావి.సినిమా చూసిన తర్వాత అమ్మాయంటే ఇలాగే ఉండాలి అనుకుంటారు.
కథానుగుణంగా నాగార్జునకి, నాకు మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కన్నడ, తెలుగు సంప్రదాయాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఇక్కడి ఇండస్ట్రీ చాలా సౌకర్యంగా అనిపిస్తున్నది. నాకు సీనియర్ నాయిక అనుష్క అంటే చాలా ఇష్టం. నన్ను కొందరు జూనియర్ అనుష్క అని పిలుస్తుంటారు. అలాంటి గొప్ప నటితో పోల్చడం నాకు ఆనందమే (నవ్వుతూ). గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలనుకుంటున్నా. అలాగే పీరియాడిక్ ఫిల్మ్ చేయాలనుంది. ఏదో ఒకరోజు రాజమౌళిగారి సినిమాలో నటించాలని బలంగా కోరుకుంటున్నా అని చెప్పింది.