డా.రాజేంద్రప్రసాద్ రూపొందిన వెబ్‌సిరీస్ హరికథ. మ్యాగీ దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 13 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. హరికథ సిరీస్ చూశాక, సినిమాగా ఎందుకు తీయలేదు? అనడుగుతారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందిన సినిమా ఇది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు చేయాల్సిన పాత్ర నాకు దక్కడం నా అదృష్టం. హరికథలు చెబుతూ బతికే గంగాచారిగా ఇందులో కనిపిస్తా. ప్యాషన్‌తో తీసిన సిరీస్ ఇది. అందరూ కచ్చితంగా ఇష్టపడతారు అని అన్నారు.
వైవిధ్యమైన చాలా పెద్ద స్క్రిప్ట్ ఇదని, యూనిట్‌లోని ప్రతిఒక్కరి సహకారం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని, ముఖ్యంగా టీజీ విశ్వప్రసాద్ లాంటి ప్రొడ్యూసర్ దక్కడం తమ అదృష్టమని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. దివి, పూజిత పొన్నాడ, శ్రీరామ్, మౌనికరెడ్డి, అర్జున్ అంబటి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కి కెమెరా: విజయ్ ఉళగనాథ్, సంగీతం: సురేశ్ బొబ్బిలి.