నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మ్యాడ్ స్కేర్. బ్లాక్‌బస్టర్ మ్యాడ్ చిత్రానికి ఇది సీక్వెల్. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. నవ్వించడం ఓ వరం. నవ్వు కష్టాలను మరిపిస్తుంది. ఈ సినిమా ఆ పనే చేసింది. ఆ విషయంలో దర్శకుడు కల్యాణ్‌శంకర్‌కి మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమాను హిట్ చేయడమే గొప్ప. దానికి సీక్వెల్ చేసి, దాన్ని ఇంకా పెద్ద హిట్ చేయడం నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఆ ఫీట్‌ను చేసిన దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ను అభినందిస్తున్నా. ఇందులో పాత్రధారులంతా అద్భుతంగా నటించారు. కెమెరా, ఎడిటింగ్, భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇలా ప్రతి క్రాఫ్ట్ ప్రాణం పెట్టి పనిచేశారు.

ఇక నాగవంశీ, మనిషి కరుకు, మనసు వెన్న. త్వరలో మేం కలిసి చేయబోతున్నాం. ఆ సినిమా గురించి తనే చెబుతాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర2 కూడా ఉంటుంది. మీరు నాపై చూపిస్తున్న అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ అన్నారు. చిత్ర టీమ్‌కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభినందనలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులంతా మాట్లాడారు.
