భారతదేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించడం అభినందనీయమని బీఆర్‌ఎస్ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ సచివాలయం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పలు కట్టడాలను నిర్మించారని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని , అమరుల త్యాగాలను స్మరిస్తూ స్మారక స్థూపం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ , దుర్గం చెరువు కేబుల్ వంతెనను నిర్మించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్, పట్టుదల, అకుంఠిత దీక్షకు ఈ నిర్మాణాలు ఒక సాక్ష్యమని వెల్లడించారు.