పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్‌రావు నిర్మించారు. ఏ.ఎం. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ సుల్తానుల బారి నుంచి సనాతన ధర్మ రక్షణకు నడుం బిగించిన చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ ఆకట్టుకున్నారు. మొఘల్ సైన్యంతో వీరమల్లు పోరాట ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఆంధీ వచ్చేసింది, అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు లాంటి డైలాగ్‌లు ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జ్యోతికృష్ణ మాట్లాడుతూ కొందరు హరిహర వీరమల్లు సినిమా గురించి తప్పుగా ప్రచారం చేశారు. మేం అవన్నీ పట్టించుకోకుండా అవాంతరాలను అధిగమించి సినిమాను పూర్తి చేశాం. ఖుషీ, గబ్బర్‌సింగ్ చిత్రాల తర్వాత పవన్ స్టామినా ఏంటో చూపించే చిత్రమిది. ఈ సినిమాకు పునాది వేసిన క్రిష్ గారికి ధన్యవాదాలు. ఈ సారి రిలీజ్ డేట్ మారదు. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి అని అన్నారు. ఏ.ఎం. రత్నం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన పూర్తిస్థాయి పాన్ ఇండియా చిత్రమిది. సినిమా ట్రైలర్‌ను మించి ఉంటుంది. ఇప్పటిదాకా మీరు పవర్‌స్టార్‌ను చూశారు. ఈ సినిమాలో రియల్ స్టార్‌ను చూస్తారు అన్నారు. ఈ నెల 24న హరిహర వీరమల్లు విడుదలవుతోంది.















