శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సింగపూర్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ ఆరాధన ఉత్సవాలను స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ వ్యవస్థపాకురాలు యడవల్లి శేషు కుమారి ఆధ్వర్యంలో రామకృష్ణా మిషన్ శారదాహాల్లో ఘనంగా నిర్వహించారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యడవల్లి శేషు కుమారి సంగీత గురువు గౌరీ గోకుల్, గౌరవ అతిథిగా రామకృష్ణా మిషన్ స్వామీజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి TAS (మనం తెలుగు ) అసోసియేషన్, శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్, STS ఎక్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం. స్వరలయ ఆర్ట్స్ సంస్థకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎఫిలియేషన్ లభించడం సద్గురు త్యాగరాజస్వామి కృపగా భావించి తమ గురువుల సమక్షంలో యూనివర్సిటీ పత్రమును ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, కిరీటి దేశిరాజు, యడవల్లి శ్రీ విద్య, యడవల్లి శ్రీరామచంద్రమూర్తి, శరజ అన్నదానం, రాధికా నడదూర్, రమ పాల్గొని త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలపించారు. యడవల్లి శేషుకుమారి శిష్యులతో పాటు పలువురు చిన్నారులు కలిసి త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలను ఆలపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఆదిత్య సత్యనారాయణ వయోలిన్పై, శివ కుమార్, కార్తీక్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి రోజా రమణి ఓరుగంటి, సౌజన్య కలిసి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు

