రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ చిత్రంలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా అనిపించింది. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అనేక నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. సార్ నాగేశ్వరరావు పాలిటిక్స్‌లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎన్నికల్లో గెలిచేవాడు. స్పోర్ట్స్‌లోకి వెళ్లుంటే పరుగుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే ధైర్యంతో యుద్దమే గెలిచేవాడంటూ రవితేజ క్యారెక్టరైజేషన్ గురించి మురళీశర్మ చెబుతున్న సంభాషణలు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన టీజర్ అందరినీ ఇంప్రెస్ చేసేలా సాగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.
