అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్‌లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ముద్ర వేశారు. ఈ చర్యను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి దీనిపై స్పందించారు. జర్నలిస్ట్‌పై వేధింపులకు పాల్పడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. గతం వారం విలేకరుల సమావేశం సందర్భంగా మోదీ ప్రదర్శించిన ప్రజాస్వామ్య విలువలకు ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పెర్రీ మాట్లాడుతూ బైడెన్ పాలనలో అమెరికా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వం తరఫున విలేకరుల సమావేశం నిర్వహించామని తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రినా సిద్దిఖీ భారత్‌లో మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు నుంచే సదరు జర్నలిస్ట్‌పై వేధింపులు మొదలయ్యాయి. ఇప్పటికే భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని వస్తున్న విమర్శలకు ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నది.