తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ హైటెక్స్‌లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి చరిత్రలో నిలిపోయేలా ఏర్పాట్లు చేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. అందరూ గులాబీ రంగు దుస్తులు, మహిళలైతే గులాబీ రంగు చీర ధరించి రావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే సూచించారు. ప్లీనరీ సందర్బంగా హైదరాబాద్ నగరం మొత్తం జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్‌లు, స్వాగత తోరణాలతో గులాబీమయమైంది. ఈ ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రతినిధులకు పసందైన విందు ఏర్పాటు చేశారు.














