అమెరికాలో టోర్నాడో బీభత్సం సృష్టించింది. మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాల్లో సంభవించిన టోర్నాడోకు ఏకంగా 23 మంది బలయ్యారు. టోర్నాడో గాలులకు భారీ భవనాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేల మంది చీకట్లో మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ టోర్నాడో బారిన పడి అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయని మిసిస్సిపీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రజలను ఆదుకునేందుకు అనేక సహాయక బృందాలు రంగంలోకి దిగినట్టు పేర్కొంది. సిల్వర్ సిటీ, రోల్లింగ్ ఫోర్క్ నగరాలపై టోర్నాడో ప్రభావం అధికంగా పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓవైపు టోర్నాడో బీభత్సం సృష్టిస్తుండగానే వడగళ్లు కూడా పడటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. అలబామా రాష్ట్రంలోని హామిల్టన్ ప్రాంతంలోని వారు కూడా టోర్నాడో బారిన పడ్డారు. సుడిగాలులకు అనేక చెట్లు కూలాయని, విద్యుత్ తీగలు తెగిపోయాయని, అనేక ఇళ్ల పైకప్పులు గాలికి ధ్వంసమయ్యాయని స్థానికులు వాపోయారు. టోర్నాడో గల్లంతైన నలుగురి కోసం పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.