అమెరికాలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. దాదాపు 300 కు పైగా గాయపడ్డారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రేక్షకులంతా వేదిక వైపునకు దూసుకురావడం ప్రారంభించారు. ఇది అక్కడున్నవారిలో భయాందోళనలకు దారితీసింది. ఈ క్రమంలో కొందరికి గాయాలు కావడం, మరికొందరు కిందపడిపోయి, అపస్మారక స్థితికి చేరకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు 8 మంది మృతులను గుర్తించాం అని హ్యూస్టన్ ప్రధాన అగ్నిమాపక అధికారి శ్యామ్యూల్ పెనా వెల్లడిరచారు. మరో 17 మందిని ఆసుపత్రులకు తరలించగా, వారిలో 11 మంది కార్డియక్ అరెస్ట్‌కు గురైనవారు ఉన్నారని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు మరణాలకు కారణాన్ని నిర్ధారించలేమని తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 50 వేల మంది అక్కడున్నట్లు వెల్లడిరచారు. మరోవైపు ఈ ఘటనకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నట్లు అక్కడి వీడియో పుటేజీలను పరిశీలిస్తున్నట్లు హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో తొలి రోజు తొక్కిసలాట కారణంగా రెండో రోజు షోను రద్దు చేశారు.