దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్‌వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొంది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని ఇద్దరు సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవదహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ పట్టణంలో ఈ ఘోరం జరిగింది. జేజూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం బ్యాంకాక్ నుంచి తిరిగివస్తుండగా ఆదివారం ఉదయం 9.03 గంటలకు ప్రమాదానికి లోనైంది. ఈ ఘటనలో 83 మంది మహిళలు, 82 మంది పురుషులు, మరో 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 179 మంది వరకు మరణించారని అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని కాపాడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిద్దరూ స్పృహ లోనే ఉన్నారని, వారి ప్రాణాలకు ప్రమాదమేదీ లేదని అధికారులు చెప్పారు.