Namaste NRI

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

నటుడు ఏవీఎం రాజన్ సతీమణి, నటి పుష్పలత (87) చెన్నైలో కన్నుమూశారు. స్థానిక టి.నగర్, తిరుమల పిళ్లై రోడ్డులోని నివాసంలో ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1958లో సెంగోట్టై సింగం అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 1961లో కొంగునాట్టు తంగం అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎంఎస్ రాజేంద్రన్ వంటి అగ్ర నటుల సరసన నటించారు. నానుమ్ ఒరు పెణ్ అనే చిత్రంలో నటుడు ఏవీఎం రాజన్తో నటించారు. ఆ తర్వాత ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

1963లో మైన్ భీ లక్కీ హూన్ అనే హిందీ చిత్రంలో, నర్స్ అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. సకలకళా వల్లభన్, నాన్ అడిమై ఇల్లై వంటి చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. తెలుగులో పెద్దకొడుకు, మేము మనుషులమే, అన్నదమ్ముల అనుబంధం, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, ‘శ్రీరామ పట్టాభిషేకం, వేటగాడు, రాధా కళ్యాణం, కొండవీటి సింహం చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన రాము చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చివరగా మురళి నటించిన పూవాసమ్(1999) చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సినిమాల వైపు తిరిగి చూడలేదు. కాగా, పుష్పలత కుమార్తె మహాలక్ష్మి రెండు జెళ్ల సీత, ఆనంద భైరవి, మాయదారి మరిది, రుణానుబంధం చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఆమె మృతిపై పలువురు తమిళ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events