
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వాగ్యుద్ధం జరిగిన మూడు రోజులకే ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా సైనిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ ఆదేశించినట్టు తెలిసింది.

అమెరికా అధ్యక్షుడికి, జాతీయ భద్రతా విభాగానికి చెందిన సీనియర్ నాయకులకు మధ్య వరుస సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోనంత వరకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. అమెరికా రక్షణ కంపెనీల నుంచి నూతన సైనిక పరికరాలను ఉక్రెయిన్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన లక్షల కోట్ల డాలర్ల భద్రతా సాయం కూడా ట్రంప్ ఉత్తర్వుల ఫలితంగా నిలిచిపోయింది.
