
అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలో భాగంగా, అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న పౌరులు త్వరలోనే తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది. ఇతర దేశాల్లో ఉంటున్న వీసా దరఖాస్తు దారులు ఇప్పటికే తమ సామాజిక మాధ్యమ ఖాతాలను యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు తప్పనిసరిగా అప్పగించాలన్న నిబంధన తెచ్చారు. ఇప్పుడు ఆ నిబంధన ప్రస్తుతం గ్రీన్‌కార్డు పౌరులకు కూడా విస్తరించారు. వారు తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను అప్పగించాలి. అయితే ఈ నిబంధన అమలులోకి వస్తే గ్రీన్‌కార్డు కలిగి ఉన్న చాలామందితో పాటు భారత సంతతి వ్యక్తులకు కూడా ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
