అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ట్రంప్ మెజారిటీ సీట్లను సాధించారు. ఈ పరిణామాలతో రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న ట్రంప్ ఓ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షుడు వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం. అయితే, ఒక నేత అధ్యక్ష పదవి చేపట్టి, మళ్లీ రెండోసారి ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ. గత 130 ఏళ్ల అమెరికా చరిత్రలో అలాంటి పరిణామం ఇప్పటి వరకూ చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ట్రంప్ సాధించబోతున్నారు. దాదాపు 132 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు.
అంతకుముందు గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ 1884 ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 1888 మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1992లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ట్రంప్ ఆ ఘనత సాధించబోతున్నారు. గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత యూఎస్ ఎన్నికల్లో ఈ విధంగా గెలుస్తున్న రెండో వ్యక్తిగా ట్రంప్ నిలవనున్నారు.