అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు పూటుగా మద్యం సేవించి ఆగస్టు 13న రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కారు. తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు. టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులు అందరినీ కిందకు దించినప్పటికీ నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లిన ఆ ఇద్దరిని గమనించలేదు. దాంతో ఆ ఇద్దరు అమెరికన్ టూరిస్టులు రాత్రంతా ఈఫిల్ టవర్‌పైనే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు టవర్ తెరిచేముందు భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతుండగా పైన నిషేధిత ప్రాంతంలో ఆ టూరిస్టులిద్దరూ పడుకుని ఉండటం గమనించారు. దాంతో షాకైన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందిని రప్పించి వారిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం పారిస్ పోలీసులు ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
