వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ మోగా టోర్నీ ముగిసిన నెల రోజుల్లోనే మరో ప్రపంచ కప్ మొదలవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈరోజు అండర్ -19 పురుషుల వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. 15వ ప్రపంచ కప్ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 13న టోర్నీ షురూ కానుంది. మొత్తం 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 4వ తేదీన ముగుస్తుంది. ఆసియా కప్ జరిగిన లంక గడ్డపై నెలల వ్యవధిలో అండర్ -19 వరల్డ్ కప్ మొదలవ్వనుంది.
శ్రీలంక 18 ఏళ్ల తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఫైనల్‌తో కలిపి 41మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. వీటి మధ్యే సెమీస్ ఫైట్ ఉంటుంది. ఈ టోర్నీలో భారత జట్టు జనవరి 14న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.