యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వాణిజ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ పెద్ద వ్యాపార కుటుంబాలకు ఇంపోర్టెడ్ గూడ్స్ డీలర్‌షిప్‌లపై ఉన్న ఏకఛత్రాధిపత్యం తొలగిపోనుంది. వాణిజ్య ఏజెన్సీల అగ్రిమెంట్లు ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అయ్యే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్టంలో మార్పులు తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. దీనికి యూఏఈ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, విదేశీ సంస్థలే అక్కడ సొంతంగా వస్తువులను విక్రయించుకోవడానికి అవసరమైన సందర్భాల్లో ఏజెన్సీల మార్పులకు అవకాశం లభిస్తుంంది.
ఇదిలా ఉంటే ఈ గల్ఫ్ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్ డీలర్‌షిప్‌ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు.