యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వలసదారులకు ఇచ్చే రెసిడెన్సీ వీసా నిబంధనలను తాజాగా సవరించింది. రెసిడెన్సీ వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే ప్రవాసులు ఇకపై తప్పనిసరిగా కనీస నెలవారీ వేతనం 10వేల దిర్హమ్స్ (రూ. 2.24లక్షలు) ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 2002 అక్టోబర్ 3న అమలులోకి వచ్చిన మంత్రిమండలి తీర్మానం నం. 65 నిబంధనలకు లోబడి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మహమ్మద్ అల్ షంసీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు.
అలాగే ప్రవాస స్పాన్సర్లు తప్పనిసరిగా బంధువుల నివాసానికి తగిన ఇండ్లను కలిగి ఉండాలి. ఇక ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీస మంత్లీ శాలరీ 15వేల దిర్హమ్స్(రూ. 3.37లక్షలు) కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఆరు కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్షిప్ కోసం ప్రవాసుల నుంచి వచ్చే దరఖాస్తులను డైరెక్టర్ జనరల్ సమీక్షించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.