యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటి నుండి కూడా తమ ఎమిరేట్స్ ఐడీ, పాస్‌పోర్టులను రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా యూఏఈ తాజాగా ఓ ప్రత్యేక సర్వీస్‌ను ప్రారంభించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ ఈ సేవలను తీసుకొచ్చింది. అయితే, ఈ సర్వీస్‌ను పొందేందుకు దరఖాస్తుదారులు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారి నాజర్ అహ్మద్ అల్ అబ్దౌలీ వెల్లడించారు.

విదేశాల నుంచి ఎమిరాటీ ఐడీ కార్డులను రెన్యువల్ విషయమై ఈ సందర్భంగా ఆయన స్పష్టతను ఇచ్చారు. అథారిటీ ప్రస్తుతం ప్రత్యేక స్మార్ట్ అప్లికేషన్ ద్వారా ఐడీ, పాస్‌పోర్టు రెన్యువల్ సర్వీసులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమిరేట్స్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు తమ మొబైల్ ఫోన్‌లలో అథారిటీ స్మార్ట్ అప్లికేషన్ ద్వారా రెన్యువల్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చని అన్నారు. సంబంధిత దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని తాలూకు రుసుము చెల్లించడం ద్వారా ప్రాసెస్ పూర్తవుతుందని తెలిపారు. ఇక దరఖాస్తుదారు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు తమ ఫోన్ నంబర్, ఈ-మెయిల్, చిరునామాలను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుందన్నారు.

