Namaste NRI

తెలంగాణలో ‘ఉద్యోగ పర్వం’… కేబినెట్ అజెండాలో ఇదే టాప్

తెలంగాణలో ఉద్యోగాల భర్తీని చేపట్టాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. కొత్త జోనల్ విధానం మేరకు వెంటనే నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులు, అధికారుల సంఖ్య, ఇతరత్రా ఎంత మోతాదులో ఉండాలో ఓ లెక్క తీయాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. అలాగే ‘జాబ్ కేలండర్’కూడా తయారు చేయాలని, ఏ యేడాదికి ఆ యేడాదే దీనిని రూపొందించాలని కూడా కేబినెట్ సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మంగళవారం భేటీ అయ్యింది. దాదాపు 7 గంటల పాటు ఈ భేటీ సాగింది. జాబ్ కేలండర్ ప్రకారం ప్రతి యేటా జనవరిలో వార్షిక ఉద్యోగాల క్యాలండ్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏ నెలలో ఏ తేదీలలో ఏయే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారన్న వివరాలను అందులో పొందుపరుస్తారు. కేరళ, ఏపీలోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు.

బుధవారం మళ్లీ భేటీ కానున్న కేబినెట్

ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో రాష్ట్ర కేబినెట్ బుధవారం మరోసారి భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. అన్ని విభాగాల ఖాళీల వివరాలతో అన్ని శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది.

రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు…

మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులపై స్వల్ప మార్పులు చేయగా, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులపై భారీగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచేసింది. 6 శాతం నుంచి 7.5 శాతం మేరకు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. ప్రస్తుతం రిజిస్టర్ చేస్తున్న డాక్యుమెంట్లపై 6 శాతం రిజిస్ట్రేషన్ ను వసూలు చేస్తున్నారు. దీనిని 7.5 శాతానికి పెంచాలని నిర్ణయించారు.

మరోవైపు హైదరాబాద్ నగర శివారుల్లో నీటి ఎద్దడి నివారణ కోసం 1,200 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన నీటి ఎద్దడి నివారించడానికి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశం సందర్భంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై చర్చించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో పాటు పలు శాఖలు నివేదికలు సమర్పించాయి. పల్లె, పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ

మున్సిపాలిటీల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా భూమిని సేకరించి ఇళ్ల స్థలాల లే అవుట్లను వేయించాలని కేబినెట్ సూచించింది. అందుకు సంబంధించిన విధానాలను రూపొందించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. అలాగే కరోనా విషయంలోనూ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో బోనా పండుగ జరుగుతోందని, ప్రజలందరూ చాలా అప్రమత్తతతో ఉండాలని సూచించింది. అయితే ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress