ఉగాది ఉత్సవాలు బోఇసీ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందల మంది తెలుగు సభ్యులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి అనే పాటతో కార్యక్రమం ప్రారంభం కాగా, అనంతరం పలు సంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.

పద్యాలు, కీర్తనలు, సంస్కృతిక ప్రదర్శనలతో పాటు సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆనందంగా గడిపారు. పిండి వంటలతో చేసిన భోజనాన్ని అతిథులు స్వీకరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేసిన చిన్నారులు, పెద్దలను మోమెంటోలతో సత్కరించడంతో పాటు క్రీడా కార్యక్రమాలలో గెలిచిన వారికి బహుమతులు అందించారు.


ఈ సందర్భంగా బోఇసీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు సింధు మెట్పల్లి మాట్లాడుతూ అందరి భాగస్వామ్యం తోనే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. బీటీఏ ఉపాధ్యక్షులు శివ నాగిరెడ్డి వుయ్యురు, కార్యదర్శి ధీరజ్ కనకాల, ఆది మేడిచర్ల, కోశాధికారి ఫణితేజ మద్దూరి, మీడియా కార్యదర్శి మైత్రి రెడ్డి, సాంస్కృతిక నిర్వాహకులు అనంత్ నిభనుపూడిలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అసోసియేన్ వ్యవస్థాపకులు హరి విన్నమాల, సింహాచలం పిల్ల మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని పిల్లలతో పంచుకోవడమే బోఇసీ తెలుగు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు.

ఈ ఏడాది నూతన అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు కొమ్మిరెడ్డి, ఉపాధ్యక్షురాలు మైత్రి కర్నాటి, కార్యదర్శి అనంత్ నిభానపూడి వుయ్యురు, కోశాధికారి నిఖిన్ నెల్లూరి, మీడియా కార్యదర్శి, సాంస్కృతిక నిర్వాహకులు శ్రీకాంత్ వడ్డిగిరి, కుమార్ ఎద్దుల మొదలగు సభ్యులను పరిచయం చేశారు. వచ్చే సంవత్సరం వైభవంగా, మరిన్ని కార్యక్రమాలతో ఉగాది చేసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
