Namaste NRI

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు,  శ్రీనివాస కల్యాణోత్సవం 

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం, రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం జరిపించారు. సుప్రభాతసేవతోపాటు తోమాలసేవ, అభిషేకం, సహస్ర నామార్చన, విశేష పూజలతో పాటు మహాలక్ష్మి, విష్ణుదుర్గ అమ్మవార్లకు, ఆంజనేయ స్వామికి అభిషేకం మొదలగు విశేష కైంకర్యాలు నిర్వహించారు.

సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు మరుసటి రోజే ఉగాది రావటం విశేషం. కళ్యాణోత్సవం తరవాత శ్రీవారు ఆస్థానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. సింగపూర్ తెలుగు సమాజం స్వర్ణోత్సవాలు మే 11 న జరుగనున్నట్లు ప్రకటించి, అందరి సహాయ సహకారాలు కోరారు. 

కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన తిరుమల లడ్డూ ప్రసాదం, తిరుమల కళ్యాణ తలంబ్రాలు, ఇతర మంగళ ద్రవ్యాలతోపాటు కార్యక్రమానికి గుర్తుగా ఒక జ్ఞాపికను అందిస్తామని కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి తెలిపారు.

సింగపూర్‌లో అరుదుగా లభించే వేప పువ్వు స్ధానిక తెలుగు వారికి ఉచితంగా అందించామన్నారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసిన ఉగాది పచ్చడిని అందరికీ పంచామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని, ఉదయం నుంచి సుమారు 5 వేల మంది భక్తులు హాజరయ్యారని చెప్పారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.

కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గానికి, అర్చకులకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు, భక్తులు, పంచాంగ పఠనం చేసిన పండితులు, సేవాదళ సభ్యులు, కార్యక్రమానికి హాజరై, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అందరికీ అనిల్ పోలిశెట్టి ధన్యవాదములు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events