ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (ఆశ) ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరానికి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆశ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తాము చేస్తున్న బ్రెస్ట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కష్ట సమయంలో ఆంధ్రరాష్ట్ర తుఫాను భాదితులకు అందించిన సహాయ సహకారాలను, అన్నం పెట్టే పేద రైతు శ్రమను గుర్తించి అందిస్తున్న చేయూతను గురించి ఆశ అధ్యక్షుడు రాజు జయప్రకాశ్ వివరించారు. అనేక సందర్భాల్లో భాదితులకు అండగా నిలబడ్డ క్షణాలని గుర్తుచేసి సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
కాగా, ఉగాది సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలను కలుపుతూ తెలుగు సంస్కృతిని చాటిచెప్పేందుకు ఆశ చేస్తున్న కృషిని అక్కడివారు అభినందించారు. ఇంతే ఆనందంగా, ఇంతకన్నా గొప్పగా ఇకముందు సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆశ బృందం పేర్కొంది. దేశాలు దాటినా కన్నభూమి కన్నీళ్లను తుడుస్తూ ఎన్నో బ్రతుకుల్లో కొత్త ఆశ పుట్టిస్తున్న ఆశ స్ఫూర్తిని పలువురు వక్తలు మెచ్చుకున్నారు.
తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగిన ఈ ఉత్సవాలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. ముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు వారికే సొంతమైన ప్రత్యేక వంటకాలు ఈ వేడుకకు మరింత వన్నెతెచ్చాయి.