Namaste NRI

11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం

“వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం” మరియు “శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై “ఉగాది కవి సమ్మేళనము” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని, కేవలం విదేశాలలో నివసిస్తున్న తెలుగు కవుల కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 11 దేశాల నుండి సుమారు 40 మంది కవులు కవయిత్రులు పాల్గొనడం చాలా సంతోషదాయకమని, త్వరలో ఈ ఈ కవితలు అన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురిస్తామని” నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు మరియు ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ వ్యవస్థాపకులు శ్రీ కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ రాజ్యసభ సభ్యులు, సాహితీవేత్త పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల కవులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆసాంతం వీక్షించి, ఆంగ్ల వ్యామోహంలో తెలుగును దూరం చేసుకోకూడదని, యువతరం కవులను రచయితలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సందేశాన్నిచ్చారు.  విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయకవి, రచయిత భువనచంద్ర, కోయిలను పిలుస్తూ ఒక పాటను రచించి శ్రావ్యంగా పాడి వినిపించడం అందరినీ మరింత ఆహ్లాదపరిచింది. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు.

రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, కవులందరూ “నా బాల్యంలో ఉగాది” అనే శీర్షికతో తమ చిన్ననాటి ఉగాది పండుగ జ్ఞాపకాలను, తాము పెరిగిన సొంత ఊరి పరిస్థితులను తలచుకుంటూ, వర్ణిస్తూ కవితలను  వినిపించడం అందరినీ మరింత విశేషంగా ఆకట్టుకుంది. అందరూ ఒకే శీర్షికతో రాసిన కవితలైనా, వివిధ ప్రాంతాలలో ఉగాది వేడుకల తీరుతెన్నులు, వివిధ మనోభావాల ద్వారా ప్రకటించబడుతూ, దేనికి అదే ప్రత్యేకంగా నిలిచాయి.

అమెరికా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఖతార్, ఒమాన్, యూఏఈ, పోలాండ్, యూకే దేశాల నుండి 40మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వంశీ అధ్యక్షరాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం, కల్చరల్ టీవీ & శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు:

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress