Namaste NRI

టాలీవుడ్‌లో తీరని విషాదం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరు 

కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్  చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ను మొదలుపెట్టారు. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.  60 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటాడు. 2002లో ఆయన నటుడిగా మారారు.  శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్ వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు. 2012లో వచ్చిన జీనియస్ చివరి సినిమా. దాదాపు 20కిపైగా సినిమాల్లో నటించారు.  సినీరంగానికి ఆయన చేసిన కృషిగానూ ఎన్నో అవార్డులను కె.విశ్వనాథ్ అందుకున్నారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నాడు. కేంద్ర ప్రభత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది.  కె.విశ్వనాథ్ పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events