కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఆథ్యాత్మికం, ఆనందం, ఆరోగ్యం, సందేశం, కలగలిపి వడ్డించిన విందు భోజనం వనభోజనం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల ఒత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు.
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగు ప్రజలంతా ఒకచోట చేరి ఆట పాటలతో సరదాగా గడిపారు. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హాంకాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులందరికీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ధన్యవాదాలు తెలిపారు. హాంకాంగ్ లో ప్రజల ఆరోగ్య, ఆహ్లాదం, శ్రేయస్సు కోసం అక్కడ వున్న కంట్రీ పార్కుల గురించి, తాము వనభోజనం కోసం వచ్చిన పార్కు గురించి కొన్ని విశేషాలను ఆమె వివరించారు.
హాంకాంగ్‌లో కేవలం ఆకాశహర్మ్యాలు, రద్దీగా ఉండే వీధులు మాత్రమే కాదు, నగరంలో చాలా సుందరమైన, పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి. అవుట్‌డోర్ అడ్వెంచర్ కోసం అంతులేని అవకాశాలు ఉన్నాయి. ట్యూన్ మున్ పార్క్ మొత్తం 12.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇది విస్తృతమైన సౌకర్యాలను అందించే మొదటి ప్రధాన పార్క్. ఇది 3 దశల్లో అందుబాటులోకి వచ్చింది. ఫేజ్ I ఆగస్ట్ 1985లో, ఫేజ్ II ఆగస్ట్ 1988లో మరియు ఫేజ్ III ఫిబ్రవరి 1991లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ టుయెన్ మున్ జిల్లా పట్టణ కేంద్రంలో , ట్యూన్ మున్ టౌన్ హాల్ పరిసరాల్లో ఉంది. ఉద్యానవనంలో సుమారు 1500 చెట్లు మరియు 200 వివిధ జాతులకు చెందిన 1,00,000 పొదలు నాటబడ్డాయి. ఈ పార్క్‌లో దాదాపు 1 హెక్టారు విస్తీర్ణంలో కృత్రిమ సరస్సు ఉంది అంటూ హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయపీసపాటి తెలిపారు. ఇలాంటి అద్భుతమైన పార్కులో వనభోజనాలు చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో ఈ వనభోజనాలకు వచ్చిన ప్రవాస భారతీయులంతా కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా గడిపారు. ప్రతీయేటా ఇలా వనభోజనాలను నిర్వహించుకుంటామంటూ ప్రవాసులు వివరించారు.