అన్నమయ్య జయంతి వేడుకల్ని పురస్కరించుకొని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వేగేశ్న ఫౌండేషన్ గాయకుల మధు గీతాలు పేరిట మే 18న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడిసన్‌లోని ఉడ్రోవిల్సన్ మిడిల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు.
భారత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మానసిక వైకల్యం, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వేగేశ్న ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. ఈ కారణంగా ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు తగిన తోడ్పాటునందిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా, సమాజంలో అందరితో సమానంగా ఆ పిల్లలు గౌరవంగా జీవించేలా కౌన్సెలింగ్ వంటివి ఇస్తూ నిరంతరం సేవలందిస్తోంది. మహోన్నత ఆశయంతో పనిచేస్తోన్న వేగేశ్న ఫౌండేషన్‌కు ఛారిటీగా అన్నమయ్య జయంతి ఈ మధుర గీతాలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈవెంట్‌కు వచ్చినవారికి విందు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.