Namaste NRI

టీపాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆధ్వర్యంలో వనభోజనాలు

అమెరికాలోని డాలస్‌ నగరంలోని ఆర్గైల్‌లోని పైలట్‌ నాల్‌ పార్క్‌లో తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 2500 మంది అతిథులకు టీపాడ్‌ బృందం సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఘుమఘుమలాడే వివిధ రకాల వంటకాలతో పాటూ వీనులవిందైన సంగీతం, నయనానందకరమైన నృత్య ప్రదర్శనలతో మరపురాని వినోదాన్ని అందించారు. సుందరమైన సరస్సు ఒడ్డున నిర్వహించిన ఈ ఆటవిడుపు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రోజు వారీ పనుల్లో నిత్యం బిజీబిజీగా గడిపే తెలుగు వారంతా తమ బంధువులు, స్నేహితులను కలుసుకుని కుశలప్రశ్నలు వేసుకున్నారు.

చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కలిసి వివిధ రకాల ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ సంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. డాలస్‌లో ఉంటున్న తెలుగు సంతతికి చెందిన యువతీయువకులు పోటాపోటీగా డాన్సులు వేశారు. ఈ కార్యక్రమంతో పైలట్‌ నాల్‌ పార్క్‌ మొత్తం తెలుగు వారితో కళకళలాడింది.  వనభోజనం సందర్భంగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, బగారా రైస్‌, పచ్చిపులుసు, పికిల్స్‌తో కూడిన తెలంగాణ వంటకాలను రుచి చూసేందుకు జనం ఉత్సాహం చూపించారు. భోజనాల సమయంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిర్వహించిన ఫేస్‌ పెయింటింగ్‌, మెహందీ సంబంధిత దుకాణాలు తెలుగువారితో కిక్కిరిశాయి.

అతిథులకు ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్‌ సుంకిరెడ్డి, అశోక్‌ కొండల, విజయ్‌ తొడుపునూరి, శ్రీధర్‌ వేముల, గోలి బుచ్చిరెడ్డి స్వయంగా భోజనం వడ్డించారు. వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్‌ బండారు (చైర్‌ ఆఫ్‌ ఫౌండేషన కమిటీ), సుధాకర్‌ కలసాని (చైర్‌ ఆఫ్‌ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్‌), రోజా ఆడెపు (కోఆర్డినేటర్‌) ఆధ్వర్యంలో మధుమతి వైశ్యరాజు సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్‌ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు)  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇనచార్జిగా అనురాధ మేకల (టీపాడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) వ్యవహరించారు. మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేశారు. స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్‌ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు,  బహుమతులు, పూజలు తదితర బాధ్యతలు నిర్వర్తించారు. భోజనాల ఏర్పాటు విషయంలో కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్‌ అన్నమనేని, సురేందర్‌ చింతల, ఆదిత్య గాదెల తదితరులు అందరి ప్రశంసలు అందుకున్నారు.  వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పాన్సర్లు, తెలుగువారందరికీ టీపాడ్‌ బృందం కృతజ్ఞతలు తెలియజేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events