యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. యాదాద్రికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శనం అనంతరం వేద పండితులు కిషన్ రెడ్డికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశీస్సులతో కేంద్రమంత్రిని అయ్యానన్నారు. తనపై ప్రధాని మోదీ కీలక బాధ్యతలు పెట్టారని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పర్యాటకం దెబ్బతిందని అన్నారు.