కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ద్వారా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. యాత్ర ఏర్పాటలపై బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే కిషన్ రెడ్డి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.
తిరుమల శ్రీవారిని, జెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాతా తెలంగాణలోని కోదాడ నుంచి కిషన్ రెడ్డి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 15న రాత్రికి తిరుమలకు చేరుకోనున్న కిషన్ రెడ్డి 16న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తెలంగాణలోని కోదాడ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు రాత్రి ఖమ్మం చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. 17వ తేదీన మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. తర్వాత వరంగల్ వెళ్ళి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని వరంగల్‌లోనే రాత్రి బస చేస్తారు. 18వ తేదీన జనగామ, యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్, ఉప్పల్, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. 19, 20 తేదీలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సాగనుంది.