విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం అన్స్టాపబుల్. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నబాబు మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం గొప్ప విషయం. అన్స్టాపబుల్ వినోదంతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమాకు బ్రహ్మానందంగారి ఆశీస్సులు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆద్యంతం చక్కటి వినోదంతో ఈ చిత్రం అలరిస్తుందని సప్తగిరి చెప్పారు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్నందించారని, రెండున్నర గంటల పాటు నవ్విస్తుందని దర్శకుడు తెలిపారు. రోజువారి ఒత్తిళ్లకు ఈ సినిమా ఓ ఔషదంలా పనిచేస్తుందని నిర్మాత రజిత్ రావు తెలిపారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.