ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. మెల్‌బోర్న్ శివార్లలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడిచేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు ఆలయ గోడలపై మిందుస్తాన్ ముర్దాబాద్ అని పెయింట్‌తో రాయడం కలకలం రేపింది. ఖలిస్తాన్ మద్దతుదారుల విద్వేష దాడితో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని, శాంతి, సంయమనం కోసం తాము ప్రార్ధన చేస్తున్నామని స్వామినారాయణ ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఉదయాన్నే తాను ఆలయానికి వెళ్లగా ఆలయ గోడలపై ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలతో పెయింటింగ్స్ కనిపించాయని ఓ స్ధానిక వ్యక్తి తెలిపారు. విద్రోహులపై విక్టోరియా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని స్ధానికులు పేర్కొన్నారు. ఆలయంపై దాడిని విశ్వహిందూ పరిషత్ ఆస్ట్రేలియా శాఖ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా భారత్ నశించాలి, భారత్‌లో ఉగ్రవాదం వర్ధిల్లాలి వంటి నినాదాలతో పాటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ దాడి ఆస్ట్రేలియాలో ప్రశాంతంగా జీవిస్తున్న హిందూ సమాజంలో కలకలం రేపిందని లిబరల్ ఎంపీ ఇవాన్ ముల్‌హోలండ్ దాడిని ఖండిస్తూ పేర్కొన్నారు.