ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ దావాపై భారత ప్రభుత్వానికి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. తన హత్యకు భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయెల్, రా అధికారి విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాతో పాటు ప్రస్తుతం అమెరికా జైలులో ఉన్న ఓ భారతీయుడు సహా గుర్తు తెలియని ఇతరులు ప్రయత్నించారని పన్నూ న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ కోర్టును ఆశ్రయించాడు.ఈ ప్రణాళిక గురించి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలుసని ఇందులో ఆరోపించాడు.
నవ భారత్ ఇప్పుడు శత్రువుల ఇండ్లకు వెళ్లి మట్టుబెడుతుంది అని ఏప్రిల్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడిన అంశాన్నీ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన హత్య ప్రణాళిక విఫలమైనప్పటికీ తాను అనుభవించిన మానసిక ఆందోళనకు గానూ పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ పన్నూ కోర్టును కోరాడు. పన్నూ పిటిషన్‌పై స్పందించిన కోర్టు, భారత ప్రభుత్వం, అజిత్ దోవల్, సమంత్ గోయెల్, విక్రమ్ యాదవ్, నిఖిల్ గుప్తాకు 21 రోజుల్లో స్పందన తెలియజేయాల్సిందిగా సమన్లు జారీ చేసింది.