
నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల (వలసేతర వీసాలు ఎఫ్, ఎం, జే) కోసం దరఖాస్తు చేసుకునేవారి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించనుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అమెరికా జాతీయ భద్రతా రీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారు ల గుర్తింపు, వారికి అమెరికా ప్రవేశాన్ని నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలను సులభతరం చేయడానికి దరఖాస్తుదా రులు తమ సోషల్ మీడియా ఖాతాలల్లోని గోప్యతా సెట్టింగ్‌లను తగిన విధంగా మార్చాలని కూడా సూచించింది. దరఖాస్తుదారులు తమ ఫారమ్‌లపై సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపింది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను త్వరలో షెడ్యూలింగ్ చేయడం ప్రారంభిస్తామని, ఈ నెల 18న అమెరికా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికా రాయబార కార్యలయం ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇటీవల ఇలాంటి ప్రకటనే విడుదల చేసింది. అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారంతా అమెరికన్లకు, అమెరికా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేకుండా ఉండాలని, వీసా జారీ ప్రక్రియలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
