రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపు నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందనుంది. 1 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. శతఘ్నులు, మందుగుండు సామగ్రి, తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ఇలా పలు విధాల సైనిక అవసరాలు అమెరికా తీర్చనుంది. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు.














