అమెరికాలో ఉంటున్న ఎన్నారైలను ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతినిధుల సభలో తన తొలి ప్రసంగంలో రిపబ్లికన్ నేత రిచ్ మెక్‌కార్మిక్ ఇలా ఎన్నారైలపై ప్రశంసలు కురిపించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్జియా నియోజక వర్గంలోని భారతీయ అమెరికన్లు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో కేవలం ఒక శాతం ఉన్న భారతీయ అమెరికన్లు అక్కడి పన్నుల చెల్లింపుల్లో మాత్రం ఆరు శాతం వాటాను కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. అంతేగాక భారతీయ కమ్యూనిటీ వారు ఎలాంటి సమస్యలు సృష్టించరని, చట్టాలను గౌరవిస్తారని కొనియాడారు.
అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే ఇతర పౌరులకు ఉండే సమస్యలేవి వారికి ఉండవు. నా నియోజకవర్గంలో ఇండియా నుంచి వలస వచ్చిన వారి వాటానే భారీగా ఉంది. ఇప్పటికే దాదాపు లక్ష మంది వరకు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఐదురుగురు డాక్టర్లలో ఒకరు భారతీయులే ఉన్నారు. ఇక్కడికి వలస వచ్చి స్థిరపడాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాం. భారత అంబాసిడర్‌తోనూ భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా అని రిచ్ చెప్పుకొచ్చారు.