విదేశాల్లో విద్య అంటే ఇంతవరకు ప్రపంచ దేశాల మెజారిటీ విద్యార్థుల గమ్యస్థానం అమెరికాగా ఉండేది. ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు, ఊరించే ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనంతో అగ్రరాజ్యం వారిని ఆకట్టుకుంటూ ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది. అమెరికా స్థానాన్ని మెల్లిగా ఇతర దేశాలు ఆక్రమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే పోటీలో అమెరికా తన పట్టును కోల్పోతున్నది. నవిటాస్ ఏజెంట్ పెర్‌సెప్షన్ సర్వే నివేదిక ప్రకారం ఇతర విద్యా గమ్యస్థానాలతో పోలిస్తే అమెరికా సురక్షితమైనది, ఆదరణ కలిగినది, ఆకర్షణీయమైనది అనే అనే విషయంలో విద్యార్థుల, ఏజెంట్ల అభిప్రాయాలు అంత సానుకూలంగా లేవని ఈ సర్వే వెల్లడించింది.

అమెరికా వీసా నిబంధనల కఠినతరం, వీసా ప్రక్రియలో మార్పుల నేపథ్యంలో ఈ క్షీణత నమోదైంది. కొత్త ప్రక్రియ ప్రకారం విద్యార్థి, ఎక్సేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ చరిత్రను అగ్రరాజ్య అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే చాలావరకు నాన్ ఇమ్మిగ్రెంట్ దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూను తప్పనిసరి చేశారు. అయితే ఈ మార్పులే అభిప్రాయం మారడానికి నేరుగా కారణం కాకపోయినప్పటికీ, ఎక్కడ చదవాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు విద్యార్థులు వీసా లభ్యత, ఇతర నిబంధనల విషయంలో స్పష్టత, సరళీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.















