ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యునైటెడ్ టెలి లింక్స్ నియోలింక్ ప్రైవేట్ లిమిటెడ్ (కార్బన్ మొబైల్ బ్రాండ్) తిరుపతి, కొప్పర్తిలోని వైఎస్‌ఆర్ ఈఎంసీలో రూ.2,150 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. నియోలింక్ గ్రూప్ చైర్మన్ రెవెన్ షెబెల్, యూటీఎల్ చైర్మన్, డైరెక్టర్ సుధీర్ హసీజ, గోల్డెన్ గ్లోబ్ ఎండీ రవికుమార్, వైఎస్‌ఆర్ ఈఎంసీలో సీఈవో నందకిషోర్‌రెడ్డిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
రాష్ట్రంలో యూటీఎల్, నియోలింక్ ప్రై లిమిటెడ్‌తో కలసి స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఫీచర్ మొబైల్ ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, టెలికాం ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు తయారు చేస్తుంది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌కు రూ.650 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్ల వంతున వెచ్చిస్తాం. ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 15`20 వేల మందికి ఉపాధి లభిస్తుంది అని ముఖ్యమంత్రి కి సంస్థ ప్రతినిధులు వివరించారు.