అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు. 2023`25 సంవత్సరానికిగాను ఏర్పాటు చేసిన కార్యవర్గంలో ఆయనను ట్రెజరర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఆయన తానాలో వివిధ పదవులను నిర్వహించారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్, రీజినల్ కో ఆర్డినేటర్ వంటి పదవులను ఆయన చేపట్టారు. కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో జన్మించిన రాజా కసుకుర్తి ఉన్నత విద్యాభ్యాసంకోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.
తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. అమెరికాలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌గా తెలుగు స్టూడెంట్లకు ఉపయోగపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గత డిసెంబర్, జనవరి నెలలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్స, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను ఆయన అందించారు.
తానా ట్రెజరర్‌గా తానా నిధుల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తానని, తెలుగు రాష్ట్రాల్లోని మనవాళ్ళకు అవసరమైన సేవ, సహాయ కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రాజా కసుకుర్తి తెలియజేశారు. కాగా కృష్ణాజిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, ఇతరులు, వీరవల్లి గ్రామస్థులు రాజా కసుకుర్తికి పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని పలువురు మిత్రులు, తానా నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.














