చిరంజీవి హీరోగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య్ణ. శృతి హాసన్ నాయిక. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. బాబీ దర్శకత్వం వహించారు. రవితేజ కీలక పాత్రలో నటించారు. ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నేను కథ వినగానే ఫస్ట్ సిట్టింగ్ లో ఒప్పుకున్న చిత్రాలన్నీ ఘన విజయాలు సాధించాయి. ఈ సినిమాకూ దర్శకుడు బాబీ కథ చెప్పగానే మనం సినిమా చేద్దామని చెప్పాను. వాల్తేరు వీరయ్య్ణ నిఖార్సయిన కమర్షియల్ సినిమా. ఈ చిత్ర విజయం ఖాయం. రవితేజ ఈ కథలోకి రాగానే ఎనర్జీ రెట్టింపు అవుతుంది. దర్శకుడు బాబీ నా అభిమాని, అయితే ఈ చిత్ర రూపకల్పనలో అతని అంకితభావం చూశాక నేను అతనికి అభిమానిని అయ్యాను. నా కెరీర్ లో ఎంతోమంది గొప్ప నిర్మాతలను చూశాను. సినిమా పట్ల అంతే ప్యాషన్ ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పగలను. దేవిశ్రీ ప్రసాద్ నాకు బిడ్డలాంటి వాడు. అతను ఇచ్చిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అవుతుంది అన్నారు. హీరో రవితేజ మాట్లాడుతూ చిరంజీవి గారి మీద అభిమానంతో పరిశ్రమకు వచ్చాను. ఆయనకు స్నేహితుడిగా, తమ్ముడిగా నటించాను. ఇప్పుడు ఇందులో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు. ఈ నెల 13న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, నాయికలు కేథరీన్ ట్రెసా నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు పాల్గొన్నారు.