అమెరికాలో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ సమన్వయకర్త రవి పొట్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ బండ్ల హనుమయ్య తదితరులు ప్రసంగించారు. సినీ సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్ బృందంల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది.

ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ఎస్, సినీ గేయరచయిత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు.

ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు గొప్పదనం, భాషను కాపాడటంలో సంఘం కృషిని ప్రశంసించారు. అనంతరం తానా ప్రతినిధులు వెంకయ్య నాయుడిని ఘనంగా సత్కరించారు. ఆధ్మాత్మిక జీవితంపై సద్గురు జగ్జీ వాసుదేవ్ ప్రసంగించారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి రచించిన తెలుగువైభవం పాటకు స్థానిక నృత్య పాఠశాల విద్యార్థులు నాట్యం చేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోకు అధిక స్పందన లభించింది. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
















