కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ దర్శకుడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ట్రైలర్ నన్ను ఇంప్రెస్ చేసింది. ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారు. మంచి సంగీతం కుదిరింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ మా చిత్రానికి ముందుగా కె. విశ్వనాథ్ గారి ఆశీర్వాదం లభించింది. మా సినిమా టైటిల్‌ను ఆయన బాగా మెచ్చుకున్నారు. శివరాత్రి రోజున మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆ రోజు కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. నేను ఇప్పటిదాకా ఐదు చిత్రాల్లో నటించాను. ఆ ఐదు చిత్రాల్లో నేర్చుకున్న అనుభవం ఈ సినిమాలో ఉపయోగించుకున్నాను. తప్పకుండా మిమ్మల్ని అలరించే సినిమా అవుతుంది అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ కిరణ్ అబ్బవరంలో ఓ క్రియేటర్ కూడా ఉన్నాడు. అతన్ని పిలిచి మనం సినిమా చేద్దామని చెప్పాను. ఈ సినిమా సెకండాఫ్ సర్ప్రైజ్ చేసింది. దర్శకుడు అనుకున్న కాన్సెప్ట్‌ను స్క్రీన్‌ప్లే మలిచిన విధానం ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, హరీశ్ శంకర్ పాల్గొన్నారు.