అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అందులోని మూడు ముఖ్యమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇరాన్ తెలిపింది. లెబనాన్‌లో కాని, ప్రతిఘటనా కూటమి అంతటా కాని జరిగే ఏ ఉల్లంఘన అయినా స్పష్టమైన పరిణామాలను, బలమైన ప్రతిస్పందనలను ఎదుర్కొంటుందని ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణను అసంబద్ధంగా అభివర్ణించిన ఇరాన్, అమెరికా పట్ల ఇరాన్‌కు తీవ్రమైన చారిత్రక అపనమ్మకం ఉందని పేర్కొంటూ గతంలో ఇచ్చిన అన్ని రకాల హామీలను పదేపదే ఉల్లంఘించిన విషయాన్ని ఉటంకించింది.

అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కు చెందిన 10 అంశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చగలదని, దీనిపై సంప్రదింపులు జరుగుతాయని పేర్కొన్నారని ఇరాన్ గుర్తుచేసింది. ఏదేమైనా ఈ ప్రతిపాదనలోని 3 నిబంధనల ఉల్లంఘన ఇప్పటి వరకు జరిగిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలీబఫ్ షేర్ చేసిన ప్రకటన పేర్కొన్నది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే ఘర్షణలను నిలిపివేయాలని, ఈ మంటలను ఆలస్యం చేయకుండా ఆర్పివేయాలని పిలుపునిచ్చారు.















