ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్నా…. వ్యక్తిగత కారణాల వల్లే స్వచ్ఛంద పదవీ విరమణ వైపు మొగ్గుచూపానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. హఠాత్తుగా ఇలా స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 26 సంవత్సరాల పాటు పోలీసు విభాగంలో పనిచేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ప్రకటిస్తున్నానని అన్నారు. పదవీ విరమణ తర్వాత పీడిత వర్గాలకు అండగా ఉంటానని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ సంస్థ నిర్వహించిన జైభీమ్ ప్రతిజ్ఞలో ఈయన పాల్గొన్నారు. ఈ ప్రతిజ్ఞ హిందూ దేవతలను కించపరిచేదిగా ఉందని, ఐపీఎస్ హోదాలో ఉంటూ ఈ ప్రతిజ్ఞలో ఎలా పాల్గొంటారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.