అఫ్గనిస్థాన్ గడ్డపై రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధాన్ని విరమించి తన సైన్యాలను అమెరికా ఉపసంహరించుకుంది. దీంతో మరోసారి అఫ్గన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. ఓవైపు తాలిబన్ల కఠిన ఆంక్షలు మరోవైపు ఆహారం, నగదు నిల్వలు ఖాళీకావడంతో తీవ్ర సంక్షోభంలోకి అఫ్గన్ జారుకుంది.తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను చేజిక్కించుకున్న తరువాత ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా స్తంభింపజేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆహార సమస్య కూడా పెరుగుతోంది. శీతాకాలంలో ఆహార సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు రావలసిన 9 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. లేని పక్షంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసలు పెరుగుతున్నాయని, ఆ వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వారు హెచ్చరించారు. తమ సెంట్రల్ నిధులను, ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం ఆశ్చర్యకరంగా ఉందని తాలిబన్ నేతలు అన్నారు. దోహా ఒప్పందానికి విరుద్ధంగా అమెరికా ప్రవరిస్తోందని వారు వ్యాఖ్యానించారు.
నగదు నిల్వలు తగ్గిపోతుండటంతో పరిస్థితులు దారుణంగా మారుతాయని అఫ్గన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డు సభ్యుడు షా మెహరబీ తెలిపారు అఫ్గన్‌లో ఈ ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించాలంటే నెలకు 150 మిలియన్ డాలర్లు అవసరం. ఈ ఏడాది చివరి వరకు సంక్షోభాన్ని ఎలాగోలా నెట్టుకురాగలం. ఇదే పరిస్థితి కొనసాగితే ఐరోపాపై తీవ్ర ప్రభావం పడుతుంది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదును వినియోగించే అవకాశం ఇవ్వకపోతే అఫ్గన్ ప్రజలు యూరప్‌కే వలస వెళ్తారు అని మెహరబీ తెలిపారు.