
రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో మద్దతు తెలియచేసిన అమెరికా పట్ల ఉక్రెయిన్‌కు కృతజ్ఞతాభావం లేదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిందించిన దరిమిలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. అమెరికా ప్రాధాన్యతను తాను అర్థం చేసుకోగలనని, ఆ దేశం చేసిన సాయానికి తాము రుణపడి ఉంటామని ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో జెలెన్స్కీ ప్రకటించారు.

అమెరికా చేసిన సాయానికి కృతజ్ఞత లేదని, తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందం షరతులను అంగీకరించడం లేదంటూ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు.అమెరికా పట్ల కృతజ్ఞతను తాము ఒక్కరోజు కూడా మరచిపోలేదని ఆయన చెప్పారు. శాంతి పునరుద్ధరణ జరగాలని, భద్రతాపరమైన హామీలు వాస్తవ హామీలు కావాలని ఆయన అన్నారు.
