అగ్రరాజ్యం అమెరికా కాదంటేనే రష్యాకు దగ్గరయ్యాం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. భారతీయ అమెరికన్ సంఘాలతో జైశంకర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి ఆయుధ సేకరణకు గతంలోనే భారత్ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, అందువల్లనే రష్యా ఆయుధాలపై ఆధారపడక తప్పలేదని అన్నారు. 1965 నుంచి 40 ఏళ్లపాటు అమెరికా ఆయుధాల్లో కనీసం ఒక్కటైనా భారత్కు అందలేదనీ, ఆ సమయంలో భారత్`సోవియట్ యూనియన్ మధ్య రక్షణ బంధం బలపడిరదని అన్నారు. సమైక్య, పటిష్ఠ, స్వతంత్ర, సంపన్న భారతం తమ ప్రయోజనాలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని అమెరికా గుర్తించలేదన్నారు. తన తండ్రి, తాత భారత రక్షణ శాఖలో పనిచేసేవారు కాబట్టి ఈ రంగంలో అమెరికా సహకారం కోసం భారత్ ఎంతగా ప్రయత్నించిందో బాగా తెలుసన్నారు. భారత్`అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం కుదిరినప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వస్తోందని తెలిపారు. ఈ బంధం మున్ముందు మరింత బలపడుతుందన్నారు.