కరోనా వల్ల రాబడి గణనీయంగా తగ్గినా, సామాన్యులను ఆదుకొని, భరోసా కల్పించామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కరోనా కష్టకాలం దేశవ్యాప్తంగా ఉందని, దీంతో రాష్ట్రాల ఆదాయాలు విపరీతంగా పడిపోయాయని పేర్కొన్నారు. ప్రజలను ఆదుకోవడానికి అప్పులు చేస్తున్నామని, అది కూడా పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని బుగ్గన ప్రకటించారు. అయితే ఉద్యోగుల జీతాల చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అప్పులు పూర్తిగా విచక్షణతోనే చేస్తున్నామని, రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసమే అప్పులు చేశామని తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5 శాతం వరకూ అప్పులు చేసుకోడానికి అనుమతి ఉంటుందని, ఆ పరిమితిలోపే అప్పులు చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు కూడా పెరిగాయని, 2019-21 నడుమ కేంద్రం 17.26 శాతం అప్పులు తీసుకుంటే, వైసీపీ ప్రభుత్వం మాత్రం 16 శాతం అప్పు చేసిందని బుగ్గన పేర్కొన్నారు.
పయ్యావుల విమర్శలపై స్పందించిన బుగ్గన..
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలు లేవని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌తో పాటు టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బుగ్గన కొట్టి పారేశారు. సీఎఫ్‌ఎంఎస్ విధానం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. 41 వేల కోట్ల అవినీతిపై కాగ్‌తో విచారణ జరిపించాలని అంటున్నారని, కాగ్ సంస్థే ఈ లేఖ రాసిందని, అందులో విచారణ ఏముంటుందని ఎదురు ప్రశ్నించారు. ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేయడం సహజమని, వాటి ఆధారంగా విమర్శించడం సబబు కాదన్నారు. 41 వేల కోట్లకు లెక్కలు లేకుండా ఏ వ్యవస్థైనా ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. సమగ్ర ఆర్థిక నిర్వాహణ వ్యవస్థ ప్రోగ్రాంలో లోపాల కారణంగానే ఈ ఇబ్బంది వచ్చిందన్నారు. ఈ ఇబ్బందిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే 2018 లో ప్రారంభించారని విమర్శించారు.